Urine Colour Health Issues : మీ యూరిన్ ఈ కలర్‌లో ఉందా.. అయితే ప్రమాదంలో ఉన్నట్లే..
Urine Colour Decides Health Issues : మానవ శరీరంలో నిరంతరం అనేక ప్రక్రియలు జరుగుతూ ఉంటాయి. శరీరం ఈ ప్రక్రియలను మనకు కొన్ని విధానాల ద్వారా వ్యక్తం చేస్తూ ఉంటుంది. అందులో ఒకటి మనం చేసే మూత్ర విసర్జన. శరీరంలో ఏర్పడే మలినాలు, వ్యర్థాలను శరీరం యూరిన్ ద్వారా బయటకు పంపుతూ ఉంటుంది. అలా వచ్చే యూరిన్ కొన్ని రంగులలో ఉంటూ ఉంటుంది. ఈ రంగుల ద్వారా మన శరీరం ఆరోగ్యపు స్థితిని తెలుసుకోవచ్చని వైద్యనిపుణులు చెబుతున్నారు. అదేంటో చూద్దాం..

లేత పసుపు రంగు మూత్రం
లేత పసుపు రంగు కలిగిన మూత్రం మీ శరీరపు ఆరోగ్యాన్ని సూచిస్తుంది. తక్కువ వాసన, మూత్రంలో కొన్ని బుడగలు, కొద్దిగా నురుగు కలిగి ఉంటుంది. మూత్రానికి వెళ్లినపుడు ఎటువంటి నొప్పి, మంట ఉండదు. శరీరంలోని వ్యర్థాలు విసర్జింపబడి శరీరం ఆరోగ్యంతో ఉంటుంది. ఈ రంగు కలిగిన మూత్రం మీ ఆరోగ్యానికి క్లీన్ సర్టిఫై ఇచ్చినట్లే.
ఎరుపు రంగు కలిగిన మూత్రం
సహజంగా మనం తీసుకునే ఆహారంలో ఎరుపు రంగు కలిగిన పదార్థాలను తీసుకోవడం ద్వారా ఇలా వచ్చే అవకాశం ఉంది. ఉదాహరణకు బీట్‌రూట్ వంటి కూరలు.. అయితే ఆహారంలో మార్పులు లేకుండా తరచూ ఇలా వస్తుంటే మాత్రం అది అనుమానించదగ్గ విషయమే. ఎందుకంటే మూత్రంలో రక్తం కలవడం లేదా కిడ్నీకి సంబంధించిన వ్యాధులు, ప్రొస్టేట్ లేదా పిత్తాశయంలో సమస్యలు కారణం కావచ్చు.
తెలుపు రంగు లేదా ముదురుపసుపు రంగు
మన మూత్రం ఒక్కోసారి తెలుపు రంగులో వస్తూ ఉంటుంది. అంటే దానర్థం శరీరంలో నీటి శాతం అవసరానికి మించి ఉన్నట్లే. అందువల్ల నీటిని కొంచెం తక్కువగా తీసుకోవాలి. అలాగే ముదురు పసుపు రంగు కలిగిన మూత్రం శరీరం డీహైడ్రేషన్ గురించి చెబుతుంది. ఈ దశలో నీటిని తీసుకోవడం మంచిది. శరీరంలో విటమిన్ల లోపం వలన కూడా ముదురు పసుపు రంగు మూత్రం వచ్చే అవకాశం ఉంది.