శరీరంలో ఐరన్ లోపిస్తే ఏమవుతుందో తెలుసా..?
శరీరం అంతటికీ రక్తంలో ఉండే హిమోగ్లోబిన్ ఆక్సిజన్ సరఫరా చేస్తుంది. ఈ హిమోగ్లోబిన్ తయారీకి ఇనుము చాలా అవసరమవుతుంది. అందువల్ల మానవ శరీరంలో ఇనుము శాతం లోపిస్తే అనేక సమస్యల వచ్చే ప్రమాదం ఉంది. ముఖ్యంగా చిన్నారులు, మహిళల్లో కనిపించే పోషకాహార లోపం ఇది.
శరీరంలో ఇనుము లోపిస్తే సాధారణంగా కనిపించే లక్షణం అలసట, నీరసం. ఐరన్ లోపించడంవల్ల శరీరం తీవ్రమైన అలసటకు గురవుతుంది. దీంతోపాటు చిరాకు, పనియందు ఏకాగ్రత తగ్గడం, బలహీనంగా ఉండటం వంటి లక్షణాలు ఉంటాయి.
ఐరన్ లోపం వల్ల శ్వాస సంబంధిత సమస్య లు తలెత్తుతాయి. రక్తంలో ఆక్సిజన్ తగ్గిపోవడం వలన ఎంత గట్టిగా శ్వాస తీసుకున్నా సరిపోనట్లు అనిపిస్తుంది.

శరీరంలో ఇనుము లోపం తీవ్రంగా ఉంటే, రక్తహీనత సమస్య వలన జుట్టు రాలిపోతుంది. అలాగే మెదడుకు సరిపడనంత ప్రాణవాయువు అందకపోవడం జరుగుతుంది. అందువల్ల మెదడులోని రక్తనాళాలు వాచి, తలనొప్పి వస్తూ ఉంటుంది.
మనిషిలో, ఆందోళన, అలజడులు ఎక్కువ అవుతాయి. ఫలితంగా అనవసర ఆందోళన పెరిగి, చిన్నచిన్న విషయాలకే టెన్షన్ పడుతూ ఉంటారు.
రక్తానికి ఎరుపు రంగునిచ్చే హిమోగ్లోబిన్ మోతాదు తగ్గిపోతుంది. కాబట్టి చర్మం కూడా తన సహజ రంగును కోల్పోతుంది. ఫలితంగా ముఖం పాలిపోవడంతో పాటు, పెదవులు, చిగుళ్లు, కనురెప్పల లోపల ఎరుపుదనం తగ్గిపోతుంది. గోర్లు పాలిపోయి విరిగిపోతూ ఉంటాయి.