దసరా కానుకగా శంకర్-సురేష్ కొండేటి కాంబో `2+1` మోషన్ పోస్టర్
దసరా కానుకగా శంకర్-సురేష్ కొండేటి కాంబో `2+1` మోషన్ పోస్టర్
జర్నలిస్టుగా రెండున్నర దశాబ్ధాలు పైగా అనుభవం.. సంతోషం సినీమ్యాగజైన్ సారధిగా సినీవార్తా లోకంలో అలుపెరగని పయనం.. పంపిణీదారుడిగా.. సినీనిర్మాతగా కెరీర్ జర్నీ.. ప్రతిదీ కఠోర శ్రమతో సాధించుకున్నవే. అడుగడుగునా అవాంతరాలు ఎదురయ్యే పరిశ్రమలో మొక్కవోని ధీక్షతో ఈ ప్రయాణంలో అనుకున్నది సాధించుకుని సంతోషంగా ప్రయాణం సాగిస్తున్న జర్నలిస్టు మిత్రుడిగా సురేష్ కొండేటి అందరికీ సుపరిచితం. 18 సంవత్సరాలుగా సంతోషం సౌతిండియా అవార్డ్స్ కర్తగా విజయవంతమైన ప్రయాణం తనకు మాత్రమే సాధ్యమైంది. మెగాస్టార్ చిరంజీవి అభిమానిగా పాలకొల్లు నుంచి హైదరాబాద్ కి సాగిన ప్రయాణంలో మెగా ఆశీస్సులతో ఎన్నో విజయాలు తన సొంతం చేసుకుని నిర్మాతగానూ కొత్త అడుగులు వేస్తూ ఎప్పటికప్పుడు నిత్యనూతన ప్రయత్నాలతో గెలుపే ధ్యేయంగా ముందుకు వెళ్లడం తన ప్రత్యేకత అని చాటుకున్నారు.
27 ఏళ్ల క్రితం కృష్ణ పత్రికలో జర్నలిస్టుగా మొదలై.. వార్త దినపత్రికలో జర్నలిస్టుగా అనుభవం సొంతం చేసుకున్నారు. ఎందరో సినీ ప్రముఖుల ఆశీర్వాదంతో `సంతోషం` పక్ష పత్రికను ప్రారంభించారు. ఈ పత్రికను విజయపథంలో నడిపించడానికి శాయాశక్తులా ప్రయత్నించారు. అటుపై సంతోషం ఫిల్మ్ అవార్డులను ఇవ్వడం ప్రారంభించారు. దక్షిణ భారతదేశంలో ప్రతిష్టాత్మక అవార్డులు అయిన `ఫిల్మ్ ఫేర్` తర్వాత అంత ప్రాముఖ్యత ఉన్న అవార్డులుగా సంతోషం ఫిల్మ్ అవార్డులు నిలిచాయంటే అందుకు సురేష్ పట్టుదల, కృషి కారణం. ఇప్పటివరకు 75 కి పైగా చిత్రాలను పంపిణీ చేసిన అనుభవంతో `ప్రేమిస్తే` చిత్రంతో నిర్మాతగా మారారు. మొదటి చిత్రంతోనే భారీ విజయాన్ని సాధించారు. జర్నీ.. షాపింగ్ మాల్ లాంటి క్లాసిక్ హిట్స్ ని అందుకున్నారు. నిర్మాతగా దాదాపు 15 సినిమాలను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. హాస్యనటుడు శంకర్ ని కథానాయకుడిగా పరిచయం చేస్తూ శంభో శంకర చిత్రాన్ని నిర్మించారు. ఆ సినిమాతో విజయం అందుకుని శంకర్ తోనే మరో సినిమా `2+1`ని ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో శంకర్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. దసరా కానుకగా.. నిర్మాత సురేష్ కొండేటి పుట్టినరోజును పురస్కరించుకుని ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ని లాంచ్ చేశారు. మోషన్ పోస్టర్ కి ఇప్పటికే పలువురు ఇండస్ట్రీ ప్రముఖుల నుంచి ప్రశంసలు దక్కాయి.
కీలక శాఖల అనుభవం:
తెలంగాణ ప్రభుత్వం స్థాపించిన ఫిల్మ్ అవార్డ్స్ కమిటీ సభ్యుడిగా.. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ(ఈసీ) మెంబర్ గా.. ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగాను పలు విభాగాల్లో సేవలు అందిస్తున్నారు.