ఎన్టీఆర్ “ముకుందా మురారి”
నందమూరి బాలకృష్ణ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మిస్తున్న చిత్రం తన తండ్రి అయిన నందమూరి తారక రామారావు గారి జీవితకథ. అదే ఎన్టీఆర్ బయోపిక్ . తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టిన అలనాటి సాటిలేని మేటి గొప్ప నటుడు ఎన్టీఆర్. బాలకృష్ణ ఎన్టీఆర్ గా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. మొదట దర్శకుడు తేజ ఈ చిత్రానికి డైరెక్టర్ గా అనుకున్నారు, కాని కొన్ని అనివార్య కారణాల వల్ల తేజ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న తరువాత క్రిష్ జాగర్లమూడి దర్శకత్వ బాధ్యతలని చేపట్టారు.బాలకృష్ణ ఈ చిత్రంలోని ప్రతి పాత్రకు తానే స్వయంగా నటీ నటుల్ని ఎంపిక చేసుకుంటున్నారు. ఎన్టీఆర్ భార్య బసవతారకం పాత్రలో బాలీవుడ్ భామ విద్యాబాలన్ నటిస్తున్నారు. సావిత్రిగా కీర్తి సురేష్ – హెచ్ ఎం రెడ్డిగా ప్రకాష్ రాజ్, కైకాల సత్యనారాయణ, మోహన్ బాబు నటిస్తున్నారు. రకుల్ శ్రీదేవి పాత్రలో నటిస్తున్నదని సమాచారం. ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి విడుదల చేస్తామని చిత్ర యూనిట్ తెలిపింది. ప్రస్తుతం ఈ చిత్రం యొక్క షూటింగ్ హైద్రాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీ లో జరుగుతుంది.
ఎన్టీఆర్ అంటే సినీరంగంలోనే కాకుండా, రాజకీయాలలో గల్లీ నుండి ఢిల్లీ దాకా తెలుగోడి పౌరుషాన్ని నిలబెట్టిన గొప్ప వ్యక్తీ కూడా , కాబట్టి ఈ సినిమాని తెలుగు, తమిళ, హిందీ రిలీజ్ చేయనున్నారు. వెన్న దొంగ, గోకుల కృష్ణుడు, గోపి లోలుడు అంటే తెలుగు వారికి ముందుగా గుర్తుకి వచ్చే శ్రీకృష్ణుడి ప్రతిరూపం అన్నగారు నందమూరి తారక రామారావు. అలనాటి పురాణగాథల చిత్రాలలో శ్రీకృష్ణుడి పాత్ర కోసం దర్శకులు ఊహించుకున్న రూపం నటసార్వభౌమ ఎన్టీఆర్. అందుకే ఆయన కాకుండా ఇంకెవ్వరు ఆ పాత్రలో నటించినా మనసుకు హత్తుకునేది కాదు. అంతగా శ్రీకృష్ణుణి గెటప్ లో ప్రజల మనసులో స్థానం సంపాదించుకున్నారు.
కృష్ణాష్టమి సందర్భంగా తాజాగా `ఎన్టీయార్` చిత్రబృందం మరో ఫోటోను విడుదల చేసింది. `కృష్ణా ముకుందా మురారీ నందమూరినందనవనవిహారి` అంటూ ఫోటో విడుదల చేసి కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేసింది. కృష్ణావతారంలో ఉన్న నందమూరి హీరోలు ఈ ఫోటోలో ఉన్నారు. పిల్లనగ్రోవి చేతపట్టుకొని మెడలో ఆభరణాలు ధరించి శిరస్సున కిరీటoతో సూటిగా చూస్తున్న ఆ శ్రీకృష్ణుని దివ్య రూపoలో నటసింహా నందమూరి బాలకృష్ణ ఈ ఫోటోలో సీనియర్ ఎన్టీఆర్ పక్కన ఉన్న ఫోటో చూస్తే క్లారిటీ వచ్చేస్తుంది. ఎన్టీఆర్ తనయుడు నందమూరి బాలకృష్ణ అన్నగారిలా కాషాయంలో కనిపించి ఆకట్టుకున్నారు. బాలకృష్ణతో కలిసి విష్ణు ఇందూరి – వారాహి చలనచిత్రం సాయికొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.