Real life stories

నా జీవితం నాశనం అయినాక … మా నాన్న మారాడు!

ma nanna maaraadu

 సృష్టిలో అమ్మ నాన్న లేనిదే ఏ జీవి పుట్టుక లేదు. మనం ఈరోజు ఎలా సంతోషంగా కాలం గడుపుతున్నాము అన్నా లేదా ఏ కష్టం లేకుండా  జీవిస్తున్నాము అన్నా దానికి కారణం మన తల్లిదండ్రులే. అసలు మన పుట్టుకకు కారణం అయిన తల్లిదండ్రులకు మనం ఏ గౌరవం ఇస్తున్నాము. మనకు ఇంత చక్కటి జీవితాన్ని ఇచ్చిన వాళ్లకి మనం ఏం ఇచ్చి  రుణం తీర్చుకోవాలి. మన జన్మంతా కష్టపడి వెతికినా ఈ ప్రశ్నకు జవాబు దొరకదు. ఎందుకంటే వారి ప్రేమకు మనం ఎంత చేసినా తక్కువే. 

చాలా మంది తల్లి గొప్పా లేదా తండ్రి గొప్పా అనే అంశాన్ని ప్రస్తావిస్తూ ఉంటారు. ఇది అర్థం లేని ప్రస్తావన అని తెలిసినా కొందరు నవమాసాలు మోసి కంటికి రెప్పలా చూసి ప్రాణం పోయే బాధను ఓర్చి జన్మనిచ్చిన తల్లి గొప్పది అని అంటారు. మంరికొందరు మన ఆలనా పాలనా చూసి మన ఎదుగుదలను తన ఎదుగుదలగా భావించి కుటుంబాన్నంతా తన భుజాల మీద వేసుకొని శ్రమించే నాన్న కి ఈ జన్మ అంకితం అంటారు. కానీ నేనేమంటానంటే మనకున్న రెండు కళ్ళలో ఏ కన్ను గొప్పదంటే ఏం చెప్పగలం. చెప్పగల ప్రబుద్ధులు ఉన్నారంటే వారు పై విధంగానే ప్రస్తావిస్తూ ఉంటారు.  

మనకు ఒక కన్ను లేకపోతేనే ఎంత బాధని అనుభవిస్తామో తల్లిదండ్రుల్లో ఏ ఒక్కరు లేకపోయినా  అంతే బాధ అనుభవిస్తాం.

తన జీవితంలో ఒక్క రోజు కూడా నాన్న కి ఎదురు చెప్పని అమ్మ కూతురి కోసం ఎదురుతిరిగితే ఆ కూతురు జీవితం ఎలా పునః ప్రారంభం అయిందో ఈ రచన ద్వారా తెలుపుతాను.ఇది కధ కాదు. మా ఇంటి పక్కన జరిగిన సంఘటన మీతో పంచుకుందామని వ్రాస్తున్నాను. సొంతపేర్లు ప్రదేశాలు తెలుపకుండా ఇతర పేర్లతో, ప్రదేశాలతో ఈ కథ వ్రాస్తున్నాను..

ఈ కథ కర్నూల్ జిల్లాలో ఒకటయిన ఆదోనిలో జరిగిన సంఘటన. శాంతినగర్ కాలనీలో ఒక చిన్న గుడిసెలో ఒక కుటుంబం నివసిస్తుంది.ఆ కుటుంబంలో తల్లిదండ్రులు, ఇద్దరు కొడుకులు, ఒక కూతురు నివసిస్తున్నారు. కొడుకుల వయసు 10 సంవతసరాలు. కూతురి వయసు 12 సంవత్సరాలు. బహు సుందరమైన సౌకర్యవంతమైన ఆ కాలనీలో అందరూ ఆనందంగా సుఖంగా జీవించేవారు. ఆ పేద గుడిసెలోని పాపకు చదువంటే చాలా ఇష్టం. పరీక్షలలో ఎప్పుడూ మొదటి స్థానంలో ఉత్తీర్ణత సాధిస్తుంది. ఒక్క మాటలో  చెప్పాలంటే పుస్తకాల పురుగు.

ఆ పాప 6వ తరగతి పూర్తిచేసుకుని 7వ తరగతిలో చేరడానికి మధ్యనున్న వేసవి సెలవుల్లో ఆనందంగా గడుపుతుంది.అలా ఓ రోజు సూర్యుడు శాంతించి చంద్రుడు ఉదయించే సమయంలో ఆ పాప తన తమ్ముళ్ళతో ఆడుకుంటూ ఉంటుంది. అదే సమయంలో కొందరు కొత్త వ్యక్తులు ఇంటికి వచ్చారు. ఆ పాపనే చూస్తూ లోనికి వెళ్లారు. అమ్మానాన్నలతో పనుండి వచ్చారేమోనని అవేం పట్టించుకోకుండా పాప తమ్ముళ్ళతో ఆటలో మునిగిపోయింది. కొంత సమయం తరువాత వచ్చిన వారు ఆ పాప తల్లిదండ్రులతో మాట్లాడి ఆ పాప వైపు చూస్తూ నవ్వులతో వెళ్లిపోతారు. అదే సమయంలో తల్లి వచ్చి కూతురికి మిఠాయిలు తినిపిస్తుంది. విషయమేమిటో ఎరుగని ఆ పాప అమ్మ ఇచ్చిన మిఠాయిలు తింటుంది. 

వారం రోజుల తర్వాత.. 

తల్లి కూతుర్ని ముస్తాబు చేస్తుంది. కూతురు ఎందుకు అమ్మ అని అడిగినా సమాధానం చెప్పకుండా ముస్తాబు చేస్తుంది. కుటుంబంలో అందరూ సంప్రదాయమైన దుస్తులతో కళకళలాడుతూ ఉంటారు. పాపకు ఏం అర్ధం కాదు. అందరూ కలిసి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్తారు. అక్కడ జరిగిన తంతుకి పాప కలలన్నీ కల్లలై పసి మది ఒక్కసారిగా శోక సంద్రంలో మునిగిపోతుంది. 

అసలేం జరిగిందంటే.. 

పాప తల్లిదండ్రులు పాపకు 12 వ ఏటనే  పెళ్లి చేసేశారు. పాప ఎంత బ్రతిమలాడినా వినిపించకోరు. పుస్తకాలే లోకమై చదువుకునే వయసులో పెళ్లంటే ఏంటో తెలియని అభంశుభం తెలియని పసిపాపకు పెళ్లి చేసిన తల్లిదండ్రులు సమాజానికి ఏం చెప్పదల్చుకున్నారో తెలియడం లేదు కానీ ఒక అమ్మాయి ఏమి తెలియని వయసులో పెళ్లి చేసుకుంటే ఆమె జీవితం ఎలా తలకిందులవుతుందో మీ ఊహకే వదిలేస్తున్నాను. ఆడుకునే వయసుకి పెళ్ళంటే అర్థమవుతుందా.?  అసలు ఆ అమ్మాయి సదరు వ్యక్తిని భర్తగా అంగీకరించగలుగుతుందా.? ఎన్నో లక్ష్యాలు సాధించాలకున్న ఆ ఆడ కూతురి కన్నీళ్లు పట్టించుకునేదెవరు.? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పలేని ఆ తల్లిదండ్రులు పెళ్ళయితే అన్నీ అవే సర్దుకుంటాయిలే అని వేదాంతం మాట్లాడుతూ కూతురిని అత్తారింటికి పంపి చేతులు దులుపుకుంటారు. 

పెళ్ళైన రెండు రోజులకే  అమ్మాయికి అర్థం అయింది ఏంటంటే.. 

తన జీవితంలోకి భర్తగా వచ్చి తన మీద పారాడే ఆ వ్యక్తి కేవలం సుఖం కోసమే తనని పెళ్లి చేసుకున్నాడని, మాట వినని యెడల చిత్ర హింసలు పెట్టడమే పనిగా పెట్టుకున్నాడని అర్థం అయింది. తనకి ఇష్టం లేకున్నా రాక్షసత్వంతో భయభ్రాంతులకు గురి చేసి మరీ శారీరక తృప్తిని తీర్చుకునేవాడు. భార్యగా కాదు కదా కనీసం మనిషిగా కూడా చూడక ఒక శృంగారపు వస్తువుగానే చూసేవాడు ఆ రాక్షసుడు. జరిగిన దానిని ఎవరూ మార్చలేరు కనుక చదువుపై ఉన్న మక్కువతో చదువుకుంటానని భర్తకి చెప్తే ఆ ఊసెత్తకుండా వాతలు పెట్టేవాడు.

అలా నెల రోజులు గడుస్తాయి..

ఓ రోజు ఒంటినిండా గాయాలతో కూతురు అత్తారింటి నుండి పారిపోయి అమ్మానాన్న దగరికి వస్తుంది. అల్లుడికి అత్తయ్యకి చెప్పకుండా ఎలా వచ్చావు అని తండ్రి ఆమెను కొడతాడు. కూతురిని ఆ గాయాలతో చూసిన తల్లి  జీవితంలో మొట్ట మొదటి సారి తన భర్తని ఎదిరించి కూతురికి అండగా నిలుస్తుంది. అలా  కూతురు తల్లిదండ్రులతోనే ఉంటుంది. తన ఒంటిమీద వున్న గాయాలు తగ్గు ముఖం పడుతున్న సమయంలో తండ్రి వచ్చి కూతురి చేతిలో పుస్తకాలు పెట్టి వెళ్లి చదువుకోమ్మా  ఇంక నీకు ఏ అడ్డూ లేదు ఏమైనా జరిగితే నేను చూసుకుంటాను అని తండ్రి హామీ ఇస్తాడు. పట్టలేని సంతోషంతో బాధని మరిచి గతాన్ని విడిచి ఆ అమ్మాయి తన చదువును కొనసాగిస్తుంది. అనుకున్నట్లుగానే , అమ్మాయి చదువుని పునః ప్రారంభించి ఉన్నత శిఖరాలకు , తల్లిదండ్రులు గర్వించే స్థాయికి చేరుకుంది.. 

నీతి : ఈ యదార్థ ఘటన ద్వారా ప్రతి తల్లిదండ్రులకు నేను చెప్పదలచకున్నది ఏంటంటే.. కూతురు పుట్టడం ఒక వరం. ఆ వరాన్ని శాపంలా భావించకండి. కొడుకు చేయలేని సేవలను కూతురు చేస్తుంది. కంటికి రెప్పలా చూసుకుంటుంది. అలాంటి కూతురు భరోసానే కానీ భారం కాదు.కూతురికి పెళ్ళి చేయడం తల్లిదండ్రుల బాధ్యత. ఆ బాధ్యతలో భాగంగా అమ్మాయి మనసుకి, వయసుకి విలువివ్వండి. తాను చదువుకోవాలన్నా, ఏదైనా సాధించాలన్నా తొలి ప్రోత్సాహం మీ వద్ద నుండే రావాలి. పెళ్లి విషయానికొస్తే పెళ్లితోనే కొత్త జీవితం మొదలవుతుంది. అది అమ్మాయి ఇష్ట పూర్వకంగా జరిగితే ఇంకా కొత్తగా ఉంటుంది. మంచి వ్యక్తిని మనసున్న వ్యక్తిని ఆమెకు భర్తగా ఇస్తే గొప్ప జీవితాన్ని ఇచ్చిన వారవుతారు. కూతురి సుఖం కన్నా మించినది తల్లిదండ్రులకు ఏముంటుంది. ఈ విషయంలో తొందరపాటు తగదు. ఒకసారి జీవితం నాశనం అయితే బాగుచేయడానికి జీవితకాలం సరిపోదు. కూతురి విషయం లో ఏదైనా చేయాలి అనుకుంటే ఒకటికి పదిసార్లు ఆలోచించండి.ఈ కథలో ఉన్న అమ్మాయికి జరిగిన సంఘటన ఇకపై మరెక్కడా జరగకూడదనే అంశాన్ని ఈ సారాంశ రూపంలో మీకు తెలియజేస్తున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button