ఆహారం: అపోహలు.. వాస్తవాలు
రాత్రిళ్లు ఎక్కువగా తినకూడదని, నిద్రపోయేముందు ఎక్కువ తింటే బరువు పెరుగుతామని చాలా మంది భావిస్తుంటారు. రాత్రిపూట తేలికపాటి ఆహారం తీసుకోవాలని వైద్యులు సైతం చెబుతూ ఉంటారు. అయితే ఆహారం విషయంలో మనం నమ్ముతున్న అపోహల గురించి వాస్తవాలను పరిశీలిస్తే..
సాధారణంగా రాత్రిళ్లు కొంతమంది ఎక్కువ ఆహారాన్ని తినడం లేదా ఎక్కువ కేలరీలు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల గుండెల్లో మంట, అజీర్తి సమస్యలు రావచ్చు. కనుక త్వరగా తినడం మంచిది. అంతేకానీ ప్రత్యేకంగా రాత్రిళ్లు తినే ఆహరం వలన బరువు పెరగడం అంటూ ఉండదు.

కొన్నిరకాల చక్కెర పదార్థలు ప్రత్యేకంగా శరీరంలో చక్కెర శాతాన్ని పెంచుతాయని భావిస్తూ ఉంటారు. అయితే టేబుల్ షుగర్‌ను తీసుకున్నా ఫ్రక్టోజ్ అనే షుగర్‌ను కలిపి తీసుకున్నా కార్న్ సిరప్ తీసుకున్నా మన శరీరం చక్కెరను ఒకే విధంగా శోషించుకుంటుంది. కనుక ఒక రకం చక్కర మంచిదని, మరో రకం చక్కెర చెడ్డదని అనుకోకూడదు.
కాఫీ ఆరోగ్యానికి హాని చేస్తుందని చాలా మంది మానేయాలని భావిస్తుంటారు. కానీ రోజుకు రెండు నుంచి మూడు కప్పుల కాఫీని తీసుకోవచ్చు. కాఫీలో ఆరోగ్యానికి మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటో కెమికల్స్ ఉంటాయి.