Bittergourd: ఇన్ని లాభాలని తెలిస్తే కాకరకాయ తప్పక తింటారు..
మనలో చాలా మంది కాకరకాయ అనగానే ముఖం చిట్లించుకుంటారు. తినడానికి ఇష్టపడరు. దీనికి కారణం అది చేదుగా ఉండటమే. అయితే ఈ చేదు వెనుక అనేక ఆరోగ్యవంతమైన ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఇది శరీరానికి చేసే మేలు అంతా ఇంతా కాదు.
ఇందులో విటమిన్ ఎ, సి, ఇ, కెలతో పాటు ఐరన్; మెగ్నీషియం, పాస్ఫరస్, పొటాషియం, సోడియం, జింక్, ఫైబర్‌తో పాటు అనేక పోషక పదార్థాలు ఉన్నాయి.
కాకరకాయలో ఉండే ఫైబర్ జీర్ణశక్తిని పెంపొందిస్తుంది. జీవక్రియల ఫలితంగా ఏర్పడే వ్యర్థాలను బయటకు పంపడంతో పాటు మలబద్దక సమస్యలను దూరం చేస్తుంది. కడుపులో ఏర్పడే పరాన్నజీవులను తొలగిస్తుంది.

కాకరకాయ మీ కిడ్నీలు, మూత్రాశయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. కాకరకాయ రసాన్ని తీసుకోవడం వల్ల కిడ్నీలో ఏర్పడే రాళ్లను సైతం తగ్గించుకోవచ్చని ఆయుర్వేదనిపుణులు చెబుతారు. లివర్ డ్యామేజ్ బారి నుంచి కాపాడుతుంది.
ఇది గుండె ఆరోగ్యానికి ఎన్నో విధాల మంచిది. శరీరంలో ఏర్పడే కొలెస్ట్రాల్ పెరగడం వల్ల ఏర్పడే అవరోధాలను తొలగించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.
షుగర్ వ్యాధితో బాధపడేవారికి కాకరకాయ ఒక వరంగా చెప్పవచ్చు. ఇందులోని ఇన్సులెన్‌ను పోలి ఉండే రసాయనాలు రక్తంలోని షుగర్ లెవెల్స్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. అందువల్ల మధుమేహంతో బాధపడేవారు కాకరకాయను తీసుకుంటే మంచిది.