డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా? అయితే ఈ టిప్స్ ని పాటించి చూడండి

మనిషి జీవితానికి గాలి, నీరు, ఆహారం ఇవన్నీ ఎంత ముఖ్యమో డబ్బు కూడా అంతే ముఖ్యమైనది అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏ వస్తువు కొనాలన్నా, షాపింగ్ చేయాలన్నా, ప్రయాణం చేయాలన్న ఇలా ఒక్కటేమిటి ప్రతి అవసరం డబ్బుతో ముడిపడి ఉంది. అందుకే “ధనం మూలం ఇదం జగత్” అన్నారు పెద్దలు. మరి అలాంటి ముఖ్యమైన డబ్బు మనకు ఎప్పుడు ఏ పరిస్థితుల్లో అవసరం అవుతుందో చెప్పడం చాలా కష్టం. కాబట్టి మనం కష్టపడి సంపాదించిన డబ్బును భవిష్యత్తులో మనకు రాబోయే అవసరాలను దృష్టిలో ఉంచుకొని పొదుపు చేసుకోవడం చాలా ముఖ్యం. ప్రతిఒక్కరు డబ్బును ఆదా చేయాలి అనుకుంటారు కాని చాలా వరకు అనవసరమైన విషయాలకోసం డబ్బును ఎక్కువగా ఖర్చు చేస్తూ జేబులు ఖాళీ చేసుకుంటూఉంటారు. ఒక పద్ధతి ప్రకారం ప్రణాళికాబద్ధoగా డబ్బును వాడుకుంటే ప్రతినెల కొంత డబ్బును పొదుపు చేసుకోవచ్చు అని ఆర్ధిక నిపుణులు సూచిస్తున్నారు. ఈ కింది కొన్ని టిప్స్ ని ఫాలో అయితే మనం కూడా కొంతవరకు డబ్బును ఆదా చేసుకోవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

మొబైల్ బిల్స్ :

చాలా మంది పోస్ట్ పెయిడ్ మొబైల్ ప్లాన్స్ ని ఉపయోగిస్తుంటారు. దీనివలన నెల చివరిలో వచ్చే మొబైల్ బిల్లు విషయంలో కంట్రోల్ గా ఉండలేరు. కనుక ముందుగా డబ్బును ఆదా చేయాలంటే పోస్ట్ పెయిడ్ కు గుడ్ బై చెప్పేయడమే. బిల్లొస్తే గానీ అసలు ఎంత అమౌంట్ పే చేయాలో తెలియదు. అందుకే వెంటనే ప్రీపెయిడ్ తీసుకోండి. ప్రీపెయిడ్ లో ఉన్నన్ని ప్లాన్స్, ఆఫర్లు పోస్ట్ పెయిడ్ లో ఉండవు. ప్రీపెయిడ్ ఉండే ఆఫర్స్ లో మనకు అవసరమైన దానిని, మన బడ్జెట్ ని బట్టి యూస్ చేసుకుంటే చాలు. డబ్బును కొంత ఆదా చేసినట్టే.
షాపింగ్ కి వెళ్ళేముందు లిస్టు రెడీ చేసుకోండి:
షాపింగ్ కి వెళ్ళే ముందే మీకు కావలసిన వస్తువుల లిస్టు రెడీ చేసుకోండి. ప్రతినెల నిత్యావసరవస్తువులకు అవసరమయ్యే బడ్జెట్ ని పక్కన పెట్టుకోవాలి. దానికి తగ్గట్టుగా కిరాణా, పాలు, కూరగాయలు వంటి వాటికోసం ఖర్చు చేయాలి. కనుక వీటికి సంబంధించిన కొనుగోళ్లలో తెలివిగా, క్రమశిక్షణతో వ్యవహరించాల్సి ఉంటుంది. లిస్టు లేకుండా షాపింగ్ కు వెళ్ళారంటే అంతే. అలా చేస్తే కంటికి కనిపించినదల్లా మనకు అవసరమే అనిపిస్తుంది. చివరికి బండెడు వస్తువులతో, బిల్ తడిసి మోపెడవుతుంది.  షాపింగ్ మాల్స్ లో మార్కెటింగ్ ట్రిక్స్ యూస్ చేసి కస్టమర్ తో సాధ్యమైనంత మేర ఎక్కువగా వస్తువులను కొనుగోలు చేయించడమే వ్యాపారుల లక్ష్యం. అందుకే ఒక లిస్టు ప్రిపేర్ చేసుకొని మాత్రమే షాపింగ్ కి వెళ్ళాలి.

మంత్లీ బడ్జెట్ ప్లాన్ చేసుకోండి:

ఇది ప్రతి ఒక్కరు ఇచ్చే సలహానే అని అనుకుంటున్నారా? కాని మనం డబ్బును ఆదా చేయాలంటే ఇది అనుసరించడం అవసరం. ఒక బడ్జెట్ ని ప్లాన్ చేసుకొని దాని ప్రకారం ఫాలో అయితే మనం ఖచ్చితంగా డబ్బును సులువుగా ఆదా చేసుకోవచ్చు.

ఉదాహరణకి ప్రతి నెల ఇంటి అద్దె, పిల్లల స్కూల్ ఫీజులు, ప్రయాణపు ఖర్చులు, కూరగాయలు,పాలు, ఆన్లైన్ షాపింగ్, కరెంటు బిల్, రెస్టారెంట్ల ఖర్చు, ఇన్సురెన్స్ పాలసీ మొదలైనవి అన్నింటికీ ఒక బడ్జెట్ ని రెడీ చేసుకుంటే డబ్బును ఆదా చేసుకోవచ్చు.

ఆన్ లైన్ షాపింగ్:

ఈ మధ్యకాలంలో షాపింగ్ కోసం బయటకు వెళ్లి ట్రాఫిక్ కష్టాల బారినపడి అలసిపోకుండా మన టైంని సేవ్ చేసుకోవడానికి అందుబాటులోకి వచ్చినది ఆన్ లైన్ షాపింగ్. ఎన్నో డిస్కౌంట్లు, డీల్స్ ఆన్ లైన్ షాపింగ్ లో కనిపిస్తుంటాయి. కనుక ఆన్ లైన్ షాపింగ్ లో కొంత అదనంగా పొదుపు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ముందుగా ఆన్ లైన్ షాపింగ్ చేసేటప్పుడు మనీ సేవ్ చేయడానికి కొన్ని టిప్స్ ని ఫాలో అయితే చాలు. Makkhi Choose టూల్ ను డౌన్ లోడ్ చేసుకుంటే చాలు. దీని ద్వారా మనం ఓ వెబ్ సైట్ లో ఒక దాని కోసం సెర్చ్ చేసినప్పుడు అదే సమయంలోనే ఆ వస్తువు ఇతర సైట్లలో ఎంతున్నదీ అని తెలియజేస్తుంది. ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు షిప్పింగ్ చార్జీ ఎంత అవుతుందో చూడాలి. కొన్ని ఐటమ్స్ కి ఫ్రీ డెలివరీ ఆప్షన్ ఉంటుంది. కొన్ని వెబ్ సైట్స్ లో వాళ్ళు ఇచ్చిన బ్యాంకు లింక్స్ ద్వారా పేమెంట్ చేస్తే అదనపు కాష్ బ్యాక్ ఆఫర్స్ ఉంటాయి. Paytm, Mobikwik, Freecharge, PayU వంటి పేమెంట్ వాలెట్స్ ని యూస్ చేస్తే షాపింగ్ లో అడిషనల్ డిస్కౌంట్స్ ని పొందవచ్చు. ప్రయాణం, హోటల్స్ మరియు సినిమాలు కోసం ఆన్లైన్ బుకింగ్ చేయండి. దీనివల్ల కొంతవరకు డబ్బును సేవ్ చేయోచ్చు.

ఆఫర్స్ మరియు సేల్ టైం లో:

షాపింగ్ కి వెళ్ళినప్పుడు ఆఫర్స్ ఉన్నాయో లేదో గమనించాలి. షాపింగ్ మాల్స్ లో దసరా, దీపావళి, క్రిస్ మస్, సంక్రాంతి, ఉగాది పండుగలకు ముందు ఆన్ లైన్ లోనూ, బయట కూడా షాపుల్లో భారీ ఆఫర్లు ఉంటుంటాయి.ఆ సమయంలో షాపింగ్ చేయడంవల్ల కొంతవరకు డబ్బును ఆదా చేయవచ్చు. హోల్ సేల్ షాప్స్ లో షాపింగ్ చేయడం కూడా ఒక మంచి నిర్ణయం. కేవలం బట్టలు మాత్రమే కాకుండా కూరగాయలు, నిత్యావసర వస్తువులను వీధి చివర్లో ఉన్న షాపులో కొనడం కంటే రైతు బజారులో వారం రోజులకు సరిపడా కూరగాయలను ఒక్కసారే తెచ్చుకోవడం వల్ల సమయం, డబ్బులు ఆదా అవుతాయి.

క్రెడిట్ కార్డ్ ఉపయోగించండి:
వాడుతున్న క్రెడిట్ కార్డును బట్టి నెలలో రూ.500 నుంచి రూ.1,000 వరకు ఆదా చేసుకునే అవకాశం ఉంది. నిత్యావసర వస్తువులు, ఇంధనంపై 5 శాతం వరకు, మూవీ టికెట్లు, రెస్టారెంట్లలో విందులపై 20 శాతం వరకు తగ్గింపులను పొందవచ్చు. ఉదాహరణకు క్రెడిట్ కార్డు ద్వారా ఒక నెలలో రూ.10,000 చెల్లింపులు చేశారనుకోండి. వడ్డీ లేకుండా తిరిగి చెల్లించేందుకు 50 రోజుల వరకు గడువు ఉంటుంది. అప్పటి వరకు బ్యాంకులో బ్యాలన్స్ ఉంచుకోవడం వల్ల దానిపై 4 శాతం వడ్డీ లభిస్తుంది. బ్యాంకు అకౌంట్ లో బ్యాలన్స్ ఉన్నప్పటికీ క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేయడం వల్ల ఈ అదనపు ప్రయోజనం పొందవచ్చు.

సేవింగ్ అకౌంట్ ని సెలెక్ట్ చేసుకోండి:
చాలామంది ప్రజలు తమ డబ్బును సేవింగ్స్ అకౌంట్ లో భద్రపరచుకుంటారు. పైన చెప్పుకున్నట్టు క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపులు చేయడం ద్వారా బ్యాంకు ఖాతాలో మిగిలి ఉన్న రూ.10,000పై 7 శాతం వడ్డీని పొందొచ్చు. కోటక్ మహింద్రా వంటి ప్రైవేటు బ్యాంకులు సేవింగ్స్ ఖాతాలోని నగదు నిల్వలపై 6 శాతాన్ని వడ్డీ ఆఫర్ చేస్తున్నాయి. కాబట్టి సేవింగ్ అకౌంట్ ద్వారా కూడా డబ్బును సేవ్ చేసుకోవచ్చు. ఫిక్స్డ్ డిపాజిట్స్ లో తమ డబ్బుని ఉంచడం ద్వారా వారు సంపాదించగల వడ్డీని వారు లాస్ అవుతారు.

మంచి వాటిలో ఇన్వెస్ట్ చేయండి:

ప్రభుత్వ ఉద్యోగులు LIC లేదా ఫిక్స్డ్ డిపాజిట్స్ లో మాత్రమే ఇన్వెస్ట్ చేస్తారు. ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్న ప్రజలు వారి డబ్బును మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. నిజానికి మీరు మల్టిపుల్ ఇన్వెస్ట్మెంట్ ప్లన్స్ ద్వారా డబ్బు ఆదా చేయవచ్చు.

ఫిక్స్డ్ డిపాజిట్స్, పిపిఎఫ్, బాండ్స్, ఎల్ఎస్ఎస్ఎస్, మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీ మార్కెట్ లో  మీ డబ్బును ఇన్వెస్ట్ చేయండి. వీటి ద్వారా కూడా ప్రతి నెల కొంత మొత్తాన్ని ఆదా చేసుకోవచ్చు.

హెల్త్ ఇన్సురెన్స్ పాలసీని తీసుకోండి:

ప్రతి సంవత్సరం ప్రీమియం చెల్లించాల్సినప్పుడు హెల్త్ ఇన్సురెన్స్ తీసుకోవడం ద్వారా డబ్బు ఆదా చేయడం ఎలా వీలవుతుంది అనుకుంటున్నారా? వ్యాధులు మరియు ప్రమాదాలు చెప్పకుండానే వస్తాయి. అత్యవసర పరిస్థితుల్లో మీరు రెండు లక్షల రూపాయలవరకు హాస్పిటల్ ఖర్చులను సేవ్ చేసుకోవచ్చు.

ఇన్ కమ్ టాక్స్ నుండి ఆదా చేసుకోవచ్చు:

.పిపిఎఫ్, ఎన్ ఎస్ సి, ఎల్ఐసీ ప్రీమియం చెల్లింపు, బ్యాంకులు, పోస్టాఫీసులతో 5 సంవత్సరాల ఎఫ్డిడీ వంటి కొన్ని పెట్టుబడుల ఎంపిక సెక్షన్ 80 సి కింద రూ .150,000 పరిమితి వరకు ఆదాయం పన్ను నుండి మినహాయించబడ్డాయి. మీరు వైద్య బిల్లు, రోజువారీ ప్రయాణ ఖర్చులు మరియు మొబైల్ బిల్లు వంటి ఖర్చులను కూడా ఇన్ కమ్ టాక్స్ ద్వారా ఆదా చేయవచ్చు.

అనవసరపు ఖర్చులకి నో చెప్పండి:

మన అవసరాలని బట్టి మాత్రమే డబ్బును ఖర్చు చేయాలి. అంతేకాని ఫ్రెండ్ బైక్ కొన్నాడని, తెలిసిన వారు కార్ కొన్నాడని ఇలా పక్కవారిని చూసి అవసరం లేకపోయినా డబ్బును ఖర్చు చేయడం మానుకోవాలి. మన బడ్జెట్ కి తగ్గట్టుగా డబ్బును ఖర్చు చేస్తే మంచిది.

ఈ పైన చెప్పిన టిప్స్ ని ఫాలో అయితే కొంతవరకు డబ్బుని ఆదా చేసుకోవచ్చు. ప్రయత్నించి చూడండి

Please follow and like us:
0

You may also like...

Leave a Reply

Your email address will not be published.

Enjoy this blog? Please spread the word :)