రివ్యూ: సరిలేరు నీకెవ్వరు


చిత్రం : ‘సరిలేరు నీకెవ్వురు’

నటీనటులు : మహేశ్ బాబు , రష్మికా మండణ్ణ, విజయశాంతి, ప్రకాష్ రాజ్, రావు రమేష్ , సంగీత, హరితేజ , పోసాని కృష్ణ మురళి, బ్రహ్మాజీ, అజయ్, జయప్రకాశ్ రెడ్డి తదితరులు

సంగీతం : దేవీ శ్రీ ప్రసాద్

ఛాయాగ్రహణం : రత్నవేలు

నిర్మాతలు : అనిల్ సుంకర – దిల్ రాజు

కథ స్ర్కీన్ ప్లే మాటలు దర్శకత్వం : అనిల్ రావిపూడి

వరుస విజయాలతో జోరుమీదున్న మహేశ్ బాబు, పదమూడేళ్ళ తర్వాత నటిస్తోన్న విజయశాంతి, ఇంత వరకూ ఫ్లాప్స్ అన్నవే లేకుండా.. టాలీవుడ్ లో దర్శకుడిగా దూసుకువెళుతోన్న అనిల్ రావిపూడి కలిసి ఈ సంక్రాంతికి ప్రేక్షకులకు ఒక ఫ్యామిలీ ప్యాక్డ్ కమర్షియల్ అండ్ కామెడీ ఎంటర్ టైనర్ అందించడానికి సిద్ధమయ్యేసరికి .. సహజంగానే సినిమా మీద విపరీతమైన హైప్ క్రియేట్ అయింది. దానికి తగ్గట్టుగానే టీజర్, ట్రైలర్స్ అభిమానుల్ని మెప్పించడంతో ఈ సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ సాధిస్తుందోనన్నఆసక్తి ప్రతీ ఒక్కరిలోనూ కలిగింది . మరి దానికి తగ్గట్టుగానే ‘సరిలేరు నీకెవ్వురు’ సినిమా ఉందో లేదో చూద్దాం..

కథ :

నా అన్నవారు ఎవరూ లేని అనాథ అజయ్ కృష్ణ (మహేశ్ బాబు ) ఆర్మీలో మేజర్ . కొందరు చిన్నారుల్ని తీవ్రవాదులు కిడ్నాప్ చేస్తే .. ఆ మిషన్ ను టేకప్ చేసి దాన్ని సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేస్తాడతడు. అయితే ఆ ఆపరేషన్ లో ఒక సైనికుడైన అజయ్ తీవ్ర గాయాల పాలవుతాడు. ఈ విషయాన్నిఅతడి తల్లి అయిన ప్రొఫెసర్ భారతి(విజయశాంతి) కి చెబుదామనుకుంటే.. ఆ ఇంట్లో అతడి చెల్లిలికి పెళ్లి చేసే మూడ్ లో ఉంటుంది ఆమె . అందుకే ఆమెకు ఆ సంగతిని పెళ్లయ్యేకా కన్విన్సింగ్ గా చెప్పాడానికి అజయ్ కృష్ణ బయలు దేరుతాడు. అయితే అతడు భారతి ఉండే కర్నూల్ కు వెళ్లే సరికి ఆమె ఒక ఆపదలో చిక్కుకుంటుంది. ఆమెను స్టేట్ మినిస్టర్ నాగేంద్ర ప్రసాద్ (ప్రకాశ్ రాజ్ ) అనుచరుల బారి నుండి కాపాడి..ఆ కుటుంబానికి అండగా నిలబడతాడు. ఇంతకీ నాగేంద్ర ప్రసాద్ , భారతికి మధ్య వైరం ఏంటి? దాన్ని అజయ్ కృష్ణ ఎలా డీల్ చేశాడు ? అన్నదే మిగతా కథ.

కథనం – విశ్లేషణ :

చిన్న స్థాయి నుంచి దర్శకుడైన ఎవరికైనా మహేశ్ బాబు లాంటి సూపర్ స్టార్ తో ఒకేసారి సినిమా చేసే ఛాన్స్ వస్తే.. సహజంగానే ఒకింత టెన్షన్ ఉంటుంది. అలాగే.. కథ, కథనాల విషయాల్లోనూ బోలెడంత కన్ఫ్యూజన్ ఉంటుంది. అలాంటి హీరో స్థాయిని సస్టైన్ చేస్తూ.. ఎట్ ది సేమ్ టైమ్ తను ఎంచుకున్న కథతో అభిమానుల్ని మెప్పించి కమర్షియల్ సక్సెస్ సాధించాలి. ఇంత పెద్ద బాధ్యతను తన భుజాలపైన వేసుకోవడం ఎలాంటి వర్ధమాన దర్శకుడికైనా కత్తి మీద సాము. కానీ అనిల్ రావిపూడి మాత్రం అది తనకి చాలా సింపుల్ అన్నట్టుగా ‘సరిలేరు నీకెవ్వురు’ చిత్రాన్ని టేకప్ చేశాడనిపిస్తుంది. ఆల్రెడీ గతంలో వెంకటేశ్ లాంటి సీనియర్ హీరోను ‘ఎఫ్ 2’ లాంటి కామెడీ ఎంటర్ టైనర్ తో డీల్ చేసి ఒక పెద్ద సక్సెస్ సాధించాడు. మహేశ్ బాబు లాంటి హీరో దగ్గర కూడా అనిల్ అదే మంత్రాన్ని ప్రయోగించడం చెప్పుకోదగ్గది. అయితే ‘ఎఫ్ 2’ పక్కా కామెడీ ఎంటర్ టైనర్ అయితే .. ఇది ఫక్తు కమర్షియల్ కథ. కాకపోతే.. తనకున్న బలం కామెడీతోనే ‘సరిలేరు నీకెవ్వురు’ను డీల్ చేయడం పెద్ద సాహసమే . అందులో అనిల్ చాలా వరకూ సక్సెస్ అయ్యాడు. కథనాన్ని సీరియస్ గా రన్ చేయకుండా అవసరమనుకున్నచోట వినోదం మిక్స్ చేసి అనిల్ తన మార్కు చూపించాడు. సినిమాకు అదే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కథ అంతగా లేకపోయినా సరే.. ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ మెంట్ మూడ్ లోకి తెప్పించి మరీ అతగాడు మ్యాజిక్ చేశాడు. ముఖ్యంగా మహేష్ బాబు ను ఎలాగైతే అభిమానులు చూడాలనుకుంటున్నారో.. సరిగ్గా అలాగే ఈ చిత్రంలో ప్రజెంట్ చేసి ఫుల్ మీల్స్ పెట్టాడు అనిల్ రావిపూడి. హీరో ఎలివేషన్ సీన్స్, బిల్డప్ షాట్స్ , ఆసక్తికరమైన సన్నివేశాలు , హాస్య సన్నివేశాలు సినిమాలో నిండుగా మెండుగా ఉండడం తో దీన్ని అభిమానులే కాదు, సాధారణ ప్రేక్షకులు కూడా ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు.

ఇక ఈ సినిమాలోని కొన్ని తమాషా సన్నివేశాల గురించి, ఆసక్తికరమైన సీన్స్ గురించి మాట్లాడుకోవాలి. సినిమా ప్రారంభంలో వచ్చే ట్రైన్ సీన్ అయితే సినిమాకి హైలైట్ గా నిలుస్తుంది. అందులో నటించిన వాళ్ల పెర్మార్మెన్స్ సినిమా అయిపోయినా సరే మనల్ని వెంటాడుతునే ఉంటుంది. అలాగే కొండా రెడ్డి బురుజు సెట్ దగ్గర వచ్చే ఇంర్వెల్ ఫైట్ సీన్ అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించడంతో పాటు .. వినోదాన్ని కూడా పంచుతుంది. అజయ్ కు ప్రకాశ్ రాజ్ చూపించే అల్లూరి సీతారామరాజు వీడియో సీన్ , నల్ల మల అడవుల్లో వచ్చే ఫైట్ సీన్ , మంత్రులు అందరినీ బాంబ్ తో బెదిరించి .. మహేశ్ చెప్పే ఎలక, రైతు కథ , క్లైమాక్స్ లో రావు రమేశ్ ఫ్యామిలీ, ప్రకాశ్ రాజ్ మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులకు బోలెడంత వినోదాన్ని పంచుతాయి. మొత్తం మీద ఈ సినిమాలో కొన్ని మైనస్ పాయింట్స్ ఉన్నాసరే అవన్నీ వినోదంలో కొట్టుకుపోతాయి. అదే సరిలేరు నీకెవ్వరు ప్రత్యేకత.

నటీనటుల పెర్ఫార్మెన్ప్ :

ఖలేజా, దూకుడు, ఆగడు లాంటి సినిమాలు చేసి కామెడీ పండించడంలో మాస్టరైపోయిన మహేశ్ బాబు ఈ సినిమాలో అయితే చెలరేగిపోయాడు. పెర్ఫెక్ట్ టైమింగ్ లో అతడు పేల్చే పంచులు, దేశభక్తి గురించి , దేశంలోని స్కాముల గురించి అతడు సంధించిన డైలాగ్స్ , ప్రకాశ్ రాజ్ తో అతడు భేటీ అయ్యే సీన్స్ అన్నిటిలోనూ సరిలేరు నీకెవ్వురు అనిపించుకున్నాడు. ఇక పాటల్లోనూ, రామ్ లక్ష్మణ్ కంపోజ్ చేసిన ఫైట్ సీక్వెన్సెస్ లోనూ అయితే మహేశ్ బాబు అభిమానుల చేత విజిల్స్ వేయించాడు. భారతిగా విజయశాంతి తనకిచ్చిన పాత్రకు నూటికి నూరు శాతం న్యాయం చేసింది. తన బిడ్డ చనిపోయాడని తెలిసిప్పుడు ఆమె పండించిన ఎమోషన్స్ అయితే మహిళా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాయి. ఇక కథానాయిక రష్మికా మండణ్ణ అయితే అటు అల్లరినీ, ఇటు గ్లామర్ ను సమపాళ్ళలో పండించి తనకి ఈ సినిమా చాలా ప్రత్యేకమైందని చాటిచెప్పింది . రావు రమేశ్ కామెడీ, సంగీత, హరితేజ బృందం ఊత పదం ఈ సినిమాకి అదనపు ఆకర్షణ గా నిలుస్తాయి. అలాగే సుబ్బరాజు, వెన్నెల కిషోర్ , బండ్ల గణేశ్ కామెడీ కూడా నవ్వులు పూయిస్తాయి. ఇకఫైనల్ గా ప్రకాశ్ రాజ్ విలనీ కొత్తగా ఏమీ లేకపోయినా.. ఇలాంటి సినిమాకి అతడి అవసరం ఉందని చెప్పకనే చెబుతుంది.

సాంకేతిక వర్గం :

దేవీ శ్రీప్రసాద్ సంగీతం ఆడియో లో వింటే పెద్దగా మెప్పించకపోయినా.. తెరమీద అయితే అదరహో అనిపిస్తాయి. ముఖ్యంగా డాంగ్ డాంగ్ సాంగ్ కైతే.. థియేటర్స్ అభిమానుల గోలతో దద్దరిల్లి పోతాయి. అలాగే.. ఎంట్రీ సాంగ్ , సూర్యుడివో చంద్రుడివో సాంగ్స్ కూడా మెప్పిస్తాయి. ఇక రత్నవేలు ఛాయాగ్రహణం అయితే సరిలేరు నీకెవ్వరు సినిమాకు మంచి రిచ్ నెస్ తీసుకొస్తుంది. అలాగే పాటల్లో కూడా అతడు తన కెమెరా పనితనాన్ని చూపించాడు. మొత్తం మీద సరిలేరు నీకెవ్వురు చిత్రానికి మహేశ్ బాబు వన్ మేన్ ఆర్మీ మేజర్ అయిపోయాడని చెప్పాలి. అంతగా కథలేకపోయినా, కామెడీతో జిమ్మిక్కులు చేసి అనిల్ రావిపూడి గత సంక్రాంతికి లాగానే ఈ సంక్రాంతికీ జనాన్ని మేజిక్ చేశాడని చెప్పొచ్చు. ఈ సీజన్ లో ఇతర సినిమాలేవీ మెప్పించకుంటే.. ఈ సినిమా మరింత దూకుడు చూపించే అవకాశాలున్నాయి.

రేటింగ్ : 3.5/5

బోటమ్ లైన్ : కామెడీ దద్దరిల్లిపోయింది.

Please follow and like us:
0

You may also like...

Leave a Reply

Your email address will not be published.

Enjoy this blog? Please spread the word :)