కేరళ వరద భీభత్సానికి కారణం ఎవరో తెలుసా?

ఇండియాలో ప్రకృతి సోయగాలతో, ఎత్తైన కొండలతో, ఎటు చూసిన పచ్చదనంతో ప్రతి ఒక్కరిని మంత్రముగ్ధులను చేసే భూతల స్వర్గం అంటే ముందుగా మనకు గుర్తుకు వచ్చేది కేరళ. అందుకే దీనిని ‘గాడ్స్ ఓన్ కంట్రీ’ అంటారు. ఇప్పుడు కేరళ రాష్ట్రం భారీ వర్షాలతో చిగురుటాకులా వణికిపోతుంది. కేరళలోని మొత్తం 14 జిల్లాల్లో రెడ్ అలెర్ట్ ప్రకటించారు. వందేళ్ళలో ఎప్పుడు కనీ విని ఎరుగని వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని 44 నదులు పొంగి ప్రవహిస్తుండటంతో అన్ని ప్రాజెక్టుల గేట్ల‌ను ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు. కేరళలోని అన్ని జిల్లాలపై వరుణుడు కుంభవృష్టి కురిపిస్తున్నాడు. 1924 తరువాత ఇంత భారీగా వర్షపాతం రావడం ఇదేకావడంతో ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని జీవనం కొనసాగిస్తున్నారు.

1924లో కేరళలో ఇదే స్థాయిలో వరదలు బీభత్సం సృష్టించాయి. అప్పట్లో ఈ రాష్ట్రం ట్రావెన్‌కోర్‌, మలబార్‌ ప్రాంతాలుగా ఉండేది. ఆ ఏడాది వర్షాకాలంలో మొత్తం 3348 మిల్లిమీటర్ల వర్షం కురిసింది. తర్వాత మళ్ళీ ఆ స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటి వరకు 2 వేల మిల్లీమీటర్లపై వర్షపాతం నమోదు అయ్యింది. కేరళలో కురుస్తున్న వర్షాలతో కొచ్చిన్‌ విమానాశ్రయాన్ని కూడా పూర్తిగా మూసివేసారు. రోడ్డు, రైలు, విమానా, జల రవాణా వ్యవస్థ అన్ని పూర్తిగా స్థంబించాయి. దీనిని బట్టి కేరళలో వరద తీవ్రత ఏ స్థాయిలో ఉందో తెలుస్తోంది.
కేరళలో ఎన్నో ఎత్తైన పెద్ద,పెద్ద వృక్షాలు ఉన్నప్పటికీ గత 20 సంవత్సరాలుగా చెట్లను అడ్డు అదుపు లేకుoడా కొట్టి పారేసి పర్యావరణాన్ని పూర్తిగా ద్వంసం చేసారు. కేరళలో గత పదేళ్ల నుంచి ఇసుక తవ్వకాలను విచ్చలవిడిగా చేయడం మొదలుపెట్టారు. మైనింగ్ కార్యకలాపాలు ఎక్కువగా జరిగాయి. దీనితో వందలాది కోట్లను అక్రమంగా సంపాదించారు. నదీ పరివాహక ప్రాంతాలను కూడా తవ్వేయడం వల్ల ఆ వరదనీటిని నిల్వచేసుకునే సహజత్వాన్ని కోల్పోయాయి. దీంతో భారీ వర్షాలు కురియడంతో ప్రవాహవేగం పెరిగి జనావాసాలపై నదీజలాలు ఎగిసిపడ్డాయి.

పశ్చిమకనుమలు పర్యావరణ పరంగా అతి సున్నితమైన ప్రాంతాలు. ఇక్కడ పర్యాటకం బాగా పెరిగింది. కేరళలో ఆ రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో ఎక్కువగా పర్యాటకరంగం నుండి లభిస్తుంది. దీన్ని ఆసరాగా చేసుకొని ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో సున్నిత ప్రాంతాల్లో చెట్లను నరికి వేసి బిల్డింగ్స్ నిర్మించారు. దీంతో నీటిని నిల్వచేసుకునే సామర్థ్యాన్ని కొండ ప్రాంతాలు కోల్పోయాయి. కొండ ప్రాంతాలపై పెరిగిన జనాభాకు అనుగుణంగా అటవీప్రాంతాలను నిర్మూలించి ఇళ్లను నిర్మించారు.

ఒక రకంగా ఈ రోజు కేరళలో జరుగుతున్న జల ప్రళయానికి ముఖ్య కారణం మానవుడే అని చెప్పాలి. మానవ తప్పిదం వల్లనే కేరళ రాష్ట్రంలో వరద విపత్తు సంభవించిందని ప్రముఖ పర్యావరణవేత్త మాధవ్ గాడ్గిల్ వెల్లడించారు. 2011వ సంవత్సరంలోనే పశ్చిమ కొండ ప్రాంతాల్లో క్వారీలకు ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించరాదని బెంగళూరులోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కు చెందిన పర్యావరణ వేత్త గాడ్గిల్ సిఫార్సు చేసినా సర్కారు దాన్ని పట్టించుకోలేదు. అయితే, కేరళలోని అప్పటి యూడీఎఫ్‌ ప్రభుత్వం  దీనిని పూర్తిగా విస్మరించింది. ఇప్పుడు జరిగిన ప్రకృతి విలయతాండవానికి ఇది కూడా ఒక కారణం. కేరళలో అసాధారణ వర్షాలు కాదు, అత్యధిక స్థాయిలో వర్షం కురవడం వల్లనే ఈ వరదలు వచ్చాయని గాడ్గిల్ చెప్పారు. ఈ వరద విపత్తుతోనైనా కేరళ సర్కారు ఇప్పటికైనా మేల్కొని పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని భవిష్యత్తులో మరోసారి ఇలాంటి విపత్తులు రాకుండా చూడాలని గాడ్గిల్ సూచించారు.

Please follow and like us:
0

You may also like...

Leave a Reply

Your email address will not be published.

Enjoy this blog? Please spread the word :)