ఎంత మంచివాడ‌వురా మూవీ రివ్యూ & రేటింగ్ !!!

ఎంత మంచివాడ‌వురా
న‌టీన‌టులు: క‌ళ్యాణ్‌రామ్‌, మెహ‌రీన్‌, సుహాసిని, న‌రేష్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, శ‌ర‌త్‌కుమార్‌, శుభ‌లేఖ సుధాక‌ర్‌, వెన్నెల కిషోర్‌, ప్ర‌వీణ్‌, సుద‌ర్శ‌న్‌, ర‌చ్చ ర‌వి త‌దిత‌రులు.
సాంకేతిక‌వ‌ర్గం: స‌ంగీతం: గోపీసుంద‌ర్‌, ఛాయాగ్ర‌హ‌ణం: రాజ్ తోట‌, కూర్పు: త‌మ్మిరాజు, క‌ళ‌: రామాంజ‌నేయులు, స‌మ‌ర్ప‌ణ‌: శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్‌, నిర్మాత‌లు: ఉమేష్ గుప్త‌, సుభాష్ గుప్త‌, ద‌ర్శ‌క‌త్వం: స‌తీష్ వేగేశ్న.
సంస్థ‌: ఆదిత్య మ్యూజిక్ ప్రైవేట్ లిమిటెడ్‌
స‌మ‌ర్ప‌ణ‌: శ‌్రీదేవి మూవీస్‌
విడుద‌ల‌: 15 జ‌న‌వ‌రి 2020
కుటుంబ క‌థా చిత్రాల‌పై మక్కువ పెంచుకుంటున్నారు యువ క‌థానాయ‌కులు. ఇంటిల్లిపాదినీ మెప్పించ‌డంలో ఉన్న ఆనందమే వేర‌ని వాళ్లు న‌మ్ముతున్నారు. అందుకే అవ‌కాశం రాగానే… మాస్ మంత్రం జ‌పించ‌డం వ‌దిలి కుటుంబ క‌థ‌ల‌కి ప‌చ్చ‌జెండా ఊపుతున్నారు. ఆ జాబితాలోకి క‌ళ్యాణ్‌రామ్ కూడా చేరారు. `118`తో గ‌తేడాది విజ‌యాన్ని అందుకున్న ఆయ‌న ఈసారి `ఎంత మంచివాడ‌వురా` అంటూ ప్రేక్ష‌కుల ముందుకొస్తున్నాడు. సంక్రాంతి సినిమాల్లో భాగంగా వ‌స్తున్న ఆఖ‌రి సినిమా ఇది. `శ‌త‌మానం భ‌వ‌తి`తో ఇంటిల్లిపాదినీ మెప్పించిన స‌తీష్ వేగ‌శ్న ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. పండ‌గ సంద‌డి… కుటుంబ క‌థ కావ‌డంతో ఈ సినిమాపై కూడా మంచి అంచ‌నాలే నెల‌కొన్నాయి. మ‌రి చిత్రం ఎలా ఉంది? క‌ళ్యాణ్‌రామ్ కుటుంబ క‌థ‌లో ఎలా ఒదిగిపోయారో తెలుసుకునేముందు క‌థేంటో చూద్దాం…

క‌థ
బాలు (క‌ళ్యాణ్‌రామ్‌) న‌వ‌త‌రం యువ‌కుడు. షార్ట్ ఫిల్మ్స్‌లో న‌టించ‌డ‌మే అత‌ని ప‌ని. ఆల్ ఈజ్ వెల్ పేరుతో ఒక సంస్థ‌ని కూడా న‌డుపుతుంటాడు. అంద‌రికీ బాలుగానే తెలిసిన అత‌ను మారు పేర్ల‌తో మూడు కుటుంబాల‌కి ద‌గ్గ‌ర‌వుతాడు. వాళ్లతో ఎమోష‌న‌ల్‌గా క‌నెక్ట‌వుతాడు. ఇంత‌కీ బాలు ఎవ‌రు? మూడు పేర్ల‌తో చ‌లామ‌ణీ కావ‌ల్సిన అవ‌స‌రం ఎందుకొచ్చింది? ఆయ‌న స్థాపించిన ఆల్ ఈజ్ వెల్ సంస్థ ఉద్దేశం ఏమిటి? త‌దిత‌ర విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:

పేరుకు త‌గ్గ‌ట్టుగానే ఇదొక మంచివాడి క‌థ‌. కొన్ని తెచ్చుకున్న రీతిలో పండిన భావోద్వేగాల‌తోనూ న‌వ్వించేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టుండే హాస్యంతో ఆస‌క్తిని రేకెత్తిస్తోంది ఈ చిత్రం. భావోద్వేగాలే ఈ సినిమాకి బ‌లం. క‌థ కానీ, పాత్ర‌లు కానీ… వాస్త‌వానికి ద‌గ్గ‌ర‌గా ఉన్న‌ట్టు ఉన్నాయి. ఈ క‌థ‌నీ, పాత్రల్నీ ప్రేక్ష‌కుడు ఓన్ చేసుకుంటాడు, దాంతో ప్ర‌తి స‌న్నివేశం గుర్తుండిపోతోంది. ఫ్లాష్ బ్యాక్‌తో ఈ క‌థ మొద‌ల‌వుతుంది. హీరో, అత‌ని స్నేహితుల మ‌ధ్య ఆరంభంలో హాస్యం బాగుంది. ఆ త‌ర్వాత ఎదుటివాళ్ల‌కి అవ‌స‌ర‌మైన బంధాల్ని, భావోద్వేగాల్ని పంచ‌డంలో భాగంగా క‌థానాయ‌కుడు చేసే ప్ర‌యాణం మొద‌ల‌వుతుంది. అదే సినిమాకి కోర్ పాయింట్‌. అక్కడే భావోద్వేగాల్ని రేకెత్తించేలా చేశాడు ద‌ర్శ‌కుడు. క‌థ‌లోకి ప్ర‌తినాయ‌కుడు రావ‌డం, హీరో అత‌న్ని అరెస్ట్ చేయించ‌డంతో క‌థ రసవత్తరంగా వెళుతుంది. ద్వితీయార్థంలో కొన్ని మ‌లుపులు, ఆ త‌ర్వాత వ‌చ్చే కేర‌ళ ఎపిసోడ్ ఆక‌ట్టుకుంటాయి. ప‌తాక స‌న్నివేశాలు మాత్రం గ్రిప్పింగ్ గా ఉన్నాయి. `శ‌త‌మానం భ‌వ‌తి`తో మంచి భావోద్వేగాలు పంచిన స‌తీష్ వేగ‌శ్న, మ‌ళ్లీ ఆ మేజిక్‌ని క్రియేట్ చెయ్యడంలో సక్సెస్ అయ్యాడు.

క‌ళ్యాణ్‌రామ్ కుటుంబ క‌థ‌లో కనిపించ‌డం కొత్త‌గా అనిపిస్తుంది. అయితే ఆయ‌న శైలి మాస్ ఎలిమెంట్స్ కూడా ఇందులో ఉన్నాయి. వాటిలో ఒదిగిపోయినంత‌గా భావోద్వేగాల‌తో కూడిన స‌న్నివేశాల‌పై మంచి ప్ర‌భావం చూపించాయి. అందుకు కార‌ణం ఆ స‌న్నివేశాల్ని డిజైన్ చేసిన విధాన‌మే అని చెప్పొచ్చు. మెహ‌రీన్ అందంగా క‌నిపిస్తూనే, అక్క‌డ‌క్క‌డా భావోద్వేగాల్ని క‌నిపిస్తుంది. పాట‌ల్లో ఆమె చాలా బాగా క‌నిపించింది. త‌నికెళ్ల భ‌ర‌ణి, శ‌ర‌త్‌బాబు, సుహాసిని త‌దిత‌రులు పాత్ర‌ల్లో ఒదిగిపోయారు. వెన్నెల‌కిషోర్ మెహ‌రీన్‌కి బావ‌గా క‌నిపిస్తాడు. హీరోకి తండ్రిగా క‌నిపించే న‌రేష్‌, హీరో ఫ్రెండ్స్ బ్యాచ్ కామెడీ కోసం చాలా ప్ర‌య‌త్నం చేసింది, ఆ సీన్స్ బాగున్నాయి. రాజీవ్ క‌న‌కాల విల‌నిజం మెప్పిస్తుంది. సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా ఉంది. రాజ్ తోట కెమెరా ప‌నిత‌నం మెప్పిస్తుంది. అద్భుతంగా తెరకెక్కించారు. గోపీసుంద‌ర్ సంగీతం వెంటాడుతుంది. ఏమో ఏమో, అవునో తెలియ‌దు.. పాట‌లు చిత్రానికి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తాయి. ఆదిత్య మ్యూజిక్ సంగీత రంగంలో అగ్ర‌గామిగా కొన‌సాగింది. వాళ్లు తొలిసారి నిర్మాణంలోకి దిగి చేసిన సినిమా ఇది. మంచి విలువ‌లు క‌నిపిస్తాయి. ద‌ర్శ‌కుడు స‌తీష్ వేగేశ్న స్వ‌త‌హాగా ర‌చ‌యిత‌. ఆ ప్ర‌భావం సినిమాపై కనిపించింది, అందంగా పాత్రలను తెరమీద చూపించాడు. అక్క‌డ‌క్క‌డా సంభాష‌ణ‌లు ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి.
సంగీతం, భావోద్వేగాల‌తో కూడిన కొన్ని స‌న్నివేశాలు
క‌ళ్యాణ్‌రామ్‌, మెహ‌రీన్ న‌ట‌న ఈ సినిమాకు ముఖ్య బలం.

చివరగా: ఈ సంక్రాంతికి కుటుంభం మొత్తం కలసి చూడదగ్గ సినిమా ఎంత మంచివాడవురా.

రేటింగ్: 3.5/5

Please follow and like us:
0

You may also like...

Leave a Reply

Your email address will not be published.

Enjoy this blog? Please spread the word :)