రివ్యూ: దొరసాని


సినిమా: దొరసాని
బ్యానర్‌: సురేష్‌ ప్రొడక్షన్స్‌ మరియు మధుర ఎంటర్‌టైన్‌మెంట్‌ మరియు బిగ్‌ బెన్‌ సినిమాస్‌
తారాగణం: ఆనంద్‌ దేవరకొండ, శివాత్మిక రాజశేఖర్‌, వినయ్‌ వర్మ, శరణ్య, కిషోర్‌, బైరెడ్డి వంశీకృష్ణారెడ్డి తదితరులు
కూర్పు: నవీన్‌ నూలి
సంగీతం: ప్రశాంత్‌ ఆర్‌. విహారి
ఛాయాగ్రహణం: సన్నీ కూరపాటి
నిర్మాతలు: మధుర శ్రీధర్‌రెడ్డి, యాష్‌ రంగినేని
కథ, కథనం, మాటలు, దర్శకత్వం: కె.వి.ఆర్‌. మహేంద్ర

ప్రేమ‌క‌థ‌ల‌కు గొప్ప సౌల‌భ్యం ఉంది. క‌థ పాత‌దైనా అడ‌గ‌రు. పాయింట్ కొత్త‌గా లేక‌పోతే గొడ‌వ పెట్టుకోరు. ఆ ఎమోష‌న్‌ని ఫీల్ అయ్యేలా తీస్తే స‌రిపోతుంది. అందుకే రొటీన్ ప్రేమ‌క‌థ‌లు కూడా బాక్సాఫీసు ద‌గ్గ‌ర హిట్ కొట్టేస్తుంటాయి.

ఓ గొప్పింటి అమ్మాయిని, పేదింటి అబ్బాయి ప్రేమించ‌డం – లేదంటే పేదింటి అమ్మాయిపై డ‌బ్బున్న అబ్బాయి మ‌న‌సు ప‌డేసుకోవ‌డం – చాలా రొటీన్ అంశాలు. అయితే ఈ క‌థ‌లు ఇప్ప‌టికీ వ‌స్తున్నాయంటే కార‌ణం.. ప్రేమ‌పై వాళ్ల‌కున్న ప్రేమ‌. ఇప్పుడు విడుద‌లైన `దొర‌సాని` కూడా ఇలాంటి క‌థే. కాక‌పోతే…. దాని భాష వేరు, వేషం వేరు, నేప‌థ్యం వేరు.. చూపించిన తీరే.. వేరు

కథ:
రాజు (ఆనంద్‌ దేవరకొండ) పేదింటి యువకుడు. దేవకి (దొరసాని) దొర కూతురు. దేవకిని చూడటమే దుర్లభం. అలాంటిది ఓ సందర్భంలో దేవకిని చూస్తాడు రాజు. తొలి చూపులనే ప్రేమిస్తాడు. కొన్నాళ్లకు దేవకి కూడా రాజును ఇష్టపడుతుంది. వీళ్ల ప్రేమకు దొర అడ్డుపడతాడు. అనేక కష్టాలకు గురిచేస్తాడు. ఇవన్నీ తట్టుకుని నిలబడ్డ ప్రేమికులకు నక్సలైట్లు అండగా నిలుస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజు దేవకి తమ ప్రేమను గెలిపించుకున్నారా లేదా అనేది కథాశం.

విశ్లేషణ:

సినిమాకి మొదటి విజయం క్యాస్టింగ్ ఆనంద్ దేవరకొండ, శివాత్మిక ఇద్దరు తమ పాత్రలకు ప్రాణం పోశారు. ఇక వినయ్ వర్మతో పాటుగా సినిమాలో మిగతా పాత్రలన్నీ తమ తమ పరిధి మేరకు నటించారు.

ప్రశాంత్ ఆర్ విహారి మ్యూజిక్ సినిమాకు ప్రాణం పోసిందని చెప్పాలి. ఇక ఆయన ఆర్ఆర్ లేకుండా సినిమా ఫీల్ రాదేమో అన్నంతగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. ఇక సన్ని కుర్రపాటి సినిమాటోగ్రఫీ సినిమాకి మరో ప్లస్ ప్లాయింట్. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఎడిటింగ్ కూడా బాగా కుదిరింది.

నిజానికి మన తెలుగు సినిమాల్లో 80 శాతం సినిమాలు ప్రేమకథలే, అలా అన్ని వచ్చినా మనసుకి హత్తుకునేవీ మాత్రం కొన్నే. ఈ సినిమా కూడా అదే కోవకు చెందింది. కొత్త దర్శకుడు మహేంద్ర కొత్త దర్శకుడిని అనే విషయం ఎక్కడా కనపడకుండా అద్భుతమైన కథ, కథనాలతో దొరసాని ఆకట్టుకుంది. 80ల నాటి పరిస్థితులకు తగినట్టుగా కథ రాసుకున్న దర్శకుడు కథనం కూడా అలాగే నడిపించాడు. కథ రొటీన్ అయినా కథనం బాగా రాసుకున్నాడు దర్శకుడు. మొత్తానికి ఈ సినిమా అన్నివర్గాల ప్రేక్షకులను మెప్పించే విధంగా ఉంది.

చివరిగా: అద్భుతమైన ప్రేమకావ్యం దొరసాని.

రేటింగ్: 3.5/5

Please follow and like us:
0

You may also like...

Leave a Reply

Your email address will not be published.

Enjoy this blog? Please spread the word :)