Tollywood news in telugu

రివ్యూ: ఆర్డీఎక్స్ లవ్

చిత్రం: ఆర్డీఎక్స్ లవ్

విడుదల తేదీ: అక్టోబర్ 11, 2019
నటీనటులు: పాయల్ రాజ్‌పుత్, తేజస్ కంచెర్ల, నరేష్, అమానీ, ఆదిత్య మీనన్, ముమైత్ ఖాన్
దర్శకుడు: భాను శంకర్
నిర్మాత: సి.కళ్యాణ్
సంగీత దర్శకుడు: రాధన్
సినిమాటోగ్రఫీ: సీ రామ్ ప్రసాద్

తేజస్‌ కంచెర్ల, పాయల్‌ రాజ్ పూత్ జంటగా భాను శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఆర్‌డీఎక్స్‌ లవ్‌’. సి. కల్యాణ్‌ నిర్మించిన ఈ సినిమా శుక్రవారం(అక్టోబర్ 11వ తేదీ) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నంది అవార్డులు కైవసం చేసుకున్న అర్థనారి వంటి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమా తర్వాత భాను శంకర్ తీసిన సినిమా ఇది కావడంతో సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. అంతేకాక ట్రైలర్ కూడా సినిమాపై హైప్ క్రియేట్ చేయగా.. ఆర్ఎక్స్ 100 వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత పాయల్ రాజ్ పూత్ సినిమాలో నటించడంతో యువతలో బజ్ క్రియేట్ అయింది. లేటెస్ట్ గా విడుదలైన ఈ సినిమా ఎటువంటి రిజల్ట్ అందుకుంది. సినిమా ఎలా ఉంది అని తెలుసుకోవాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.

కథ:
చంద్రన్నపేట అనే గ్రామంలో ప్రభుత్వం కార్యక్రమాలను చురుకుగా ప్రజల్లోకి తీసుకుని వెళ్లే యువతి అలివేలు (పాయల్ రాజ్ పూత్). ప్రతీ విషయంపై ప్రజలకు అవగాహన కల్పించే అలివేలు.. ముఖ్యమంత్రిని కలవాలని అనుకుంటుంది. ఇందుకోసం హీరో తేజస్ ను వాడుకుంటుంది. ఇంతకు ఆమె ఎలా తేజస్ ను వాడుకుంటుంది. అసలు ముఖ్యమంత్రిని ఎందుకు కలవాలని అనుకుంటుంది. చివరకు కలుస్తుందా? ఆమె లక్ష్యం ఏంటీ? అనే విషయాలను తెలుసుకోవాలంటే సినిమాకు వెళ్లాల్సిందే.

విశ్లేషణ:
తన మొదటి సినిమా అర్థనారిలో కరెంట్, రోడ్, ఓటు హక్కు.. ఇలా సమాజంలో కళ్ల ముందు ఉండే ప్రతి అంశం గురించి ప్రస్తావించి, సామాన్యుడు తన బాధ్యతలను విస్మరించడం వల్లే సమాజంలో అన్యాయాలు ఎక్కువ అవుతున్నట్లు చూపించి నందిఅవార్డు మూవీని తెరకెక్కించిన దర్శకుడు ఈసారి కూడా అదే పంథాను ఎంచుకున్నాడు. అయితే కేవలం సోషల్ మెసేజ్ ఇవ్వలేదు. కాస్త కమర్షియల్ గా సోషల్ మెసేజ్ ని కలిపి సినిమాను రూపొందించాడు. అభివృద్ధికి దూరంగా ఉండే గ్రామాలు, అభివృద్ధికి నోచుకోని గ్రామాలు, గురించి చెబుతూ.. చాలా ఆసక్తికరంగా సినిమాను తెరకెక్కించారు. లేడీ ఓరియెంటెడ్ సినిమాగా రూపొందించిన దర్శకుడు సినిమాలో హాట్ సీన్లతో యువతకు దగ్గర చేశాడు. కమర్షియల్ ఎలిమెంట్స్ పై ఫోకస్ చేస్తూనే.. సోషల్ మెసేజ్ చెప్పేశాడు. హీరోహీరోయిన్ల మధ్య ఆహ్లాదం కలిగించే రొమాంటిక్ సన్నివేశాలు బాగా ఉన్నాయి. సాంప్రదాయ దుస్తులలో పాయల్ చాలా అందంగా కనిపించింది. సురక్షిత శృంగారం గురించి చెప్పే క్రమంలో డైలాగ్స్ కొంచెం బోల్డ్ గా ఉన్నా చాలా బాగున్నాయి. కొన్ని బోల్డ్ సన్నివేశాలు, కామెడీ డైలాగ్స్ తో మూవీ మొదటిసగం నడవగా ఇంటర్వల్ ఎపిసోడ్ ఆసక్తికరంగా ఉంది. దర్శకుడు రాసుకున్న డైలాగులు ఆకట్టుకున్నాయి. సినిమా మొత్తం ఎక్కువ భాగం పాయల్ రాజ్ పూత్ క్యారెక్టర్ చుట్టూనే సాగుతుంది. కథనంలో కాస్త తడబడినట్లు అనిపించినా క్లైమాక్స్ వరకు అన్నీ క్లియర్ చేసుకుంటూ దర్శకుడు మంచి ఫినిషింగ్ ఇచ్చాడు.

నటీనటుల నటన:
సినిమాలో మేజర్ ప్లస్ పాయల్ రాజ్ పూత్ నటన… రావడమే సంచలన విజయంతో సినిమాల్లోకి అడుగుపెట్టిన ఈ భామ.. ఫస్ట్ సినిమాతోనే యాక్టింగ్ పరంగా మంచి మార్కులు కొట్టేసింది. ఈ సినిమాలో కూడా ఆమెపై పెట్టుకున్న అంచనాలను ఏ మాత్రం తగ్గించలేదు. కంట్రోల్ యువర్ ఫీలింగ్స్, సేఫ్టీ, అపరిచితునితో శృంగారం చేశారా లాంటి డైలాగ్స్ చెప్పడం కష్టం అయినా కూడా ఏ మాత్రం మొహమాటం లేకుండా సినిమాలో చాలా చక్కగా డైలాగులు చెప్పేసింది. అందం, అభినయంతో సినిమాను భుజాలపై మోసింది. సినిమాలో ప్రతీ సన్నివేశంలోనూ పాయల్ నటన ఔరా అనిపిస్తుంది. మాస్ ప్రేక్షకులకు కావలసిన ఎంటర్ టైన్ మెంట్ ఇవ్వడంలో పాయల్ సక్సెస్ అయ్యింది. ఇక సినిమాకి మరో ప్రధాన బలం విలన్ ఆదిత్య మీనన్. సినిమాలో విలన్ పాత్రకు మంచి మార్కులు పడుతాయంటే అది ఆయన వల్లే. ఇక సినిమాలో హీరో తేజస్ తన పాత్రకు తగ్గట్లుగా ఒదిగిపోయాడు. మునుపటి చిత్రాలతో పోల్చుకుంటే బాగా నటించాడు. తులసీ, మొమైత్ ఖాన్, నరేష్.. వారి పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారు.

సాంకేతిక విభాగం:
గ్రామీణ వాతావరణాన్ని చక్కగా తెరకెక్కించడంలో కెమెరా పనితనం కనిపించింది. సినిమాటోగ్రఫీ సినిమాకు చాలా ప్లస్. నిర్మాణ విలువలు బాగున్నాయి. రాధన్ సంగీతం బాగుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోరు ఆకట్టుకుంటుంది. పాటల సాహిత్యం బాగుంది. ఎడిటింగ్ ఇంకాస్త కసరత్తు అవసరమే. దర్శకుడు శంకర్ భాను కథకు పూర్తి న్యాయం చేశారు. అనుకున్న కథను అనుకున్నట్లుగానే తీశారు. కథాంశం చాలా బాగుంది ట్విస్ట్ లు బాగా క్రియేట్ చేసుకున్నాడు. అయితే అక్కడక్కడా కొన్ని అనవసరమైన సన్నివేశాలు తీసినట్లు అనిపిస్తుంది. తన ప్రతిభను నూరు శాతం నిరూపించుకున్నాడు. నిర్మాత కళ్యాణ్ నిర్మాణ విలువలు బాగున్నాయి.

ప్లస్ పాయింట్లు
కథ, కథనం,
దర్శకత్వం,
పాయల్ నటన, స్కిన్ షో
సోషల్ మెసేజ్
సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్లు:
అక్కడక్కడ సాగదీత సన్నివేశాలు

ఓవరాల్ గా సినిమా కమర్షియల్ యాంగిల్ లో నడిచే పక్కా సోషల్ మెసేజ్ సినిమా. బోల్డ్ కంటెంట్ తో సామాజిక కోణం స్పృసిస్తూ చెప్పిన కథ కావడంతో అన్నీ వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. పక్కా పైసా వసూల్ మూవీ.

రేటింగ్: 3.25 / 5

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button