All crafts of the Telugu Industry have joined together and raised their voice about Justice for Dr.Disha .

దిశకు న్యాయం జరగాలంటే ఉరే సరి
– తెలుగు సినిమా పెద్దల ఉద్ఘాటన
– కొవ్వొత్తులతో తెలుగు సినిమా పరిశ్రమ ర్యాలీ

జస్టిస్ ఫర్ దిశ – ఈ దిశగానే తెలుగు సినిమా రంగం కదిలింది. మానవ మృగాల బారినపడి అసువులు బాసిన డా. దిశకు
చిత్రపరిశ్రమ యావత్తూ ఘనంగా నివాళులర్నించింది. హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ ఆవరణ నుంచి ఫిలింనగర్ కల్చరల్
సెంటర్ వరకూ కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ నిర్వహించింది. తెలుగు సినిమా రంగానికి చెందిన 24 వృత్తుల వారూ ఈ
ప్రదర్శనలో పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటుచేసిన సభలో పలువురు పరిశ్రమ పెద్దలు, మాజీ మంత్రులు ప్రసంగించారు. దిశ
ఘటనలో సత్వర న్యాయమే శరణ్యమన్నారు. హీరో విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ సమాజంలో ఇలాంటి అకృత్యాలు
జరగకూడదన్నారు. దోషులకు కఠిన దండన తప్పనిసరి అని, అది జరిగితేనే దిశ ఆత్మకు శాంతి కలుగుతుందని అన్నారు.
రచయిత పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ అనాదిగా స్ర్తీజాతికి అన్యాయం జరుగుతూనే ఉందన్నారు. కృతయుగం,
త్రేతాయుగం, ద్వాపరయుగంలోనూ స్ర్తీకి అన్యాయం జరిగిన ఘటనలు ఉన్నాయని, కాకపోతే చివరికి వారు సింహాసనాన్ని
అధిష్టించి ధర్మం నిలబడిందన్నారు. ఈరోజు ఆ పరిస్థతులు లేవన్నారు. ఎలాంటి ఘటన జరిగినా ముందు స్పందిందేది సినిమా
పరిశ్రమేనని గుర్తుచేశారు. ఎవరికి ఏ కష్టమొచ్చినా పరిశ్రమ అండగా నిలబడుతుందన్నారు. 100 మంది దోషులు
తప్పించుకున్నా ఫరవాలేదుగాని ఒక్క నిర్దోషికి కూడా శిక్షపడకూడదన్న చట్టంలోని లొసుగుల వల్ల సత్వర న్యాయం జరగడం
లేదన్నారు. జీవిత ఖైదును జీవితాంత ఖైదుగా మార్చాలన్నారు. ‘చట్టమంటే భయంలేదు… సమాజమంటే సిగ్గులేదు’
అనేలా నేటి పరిస్థితులు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ‘మా’ ప్రధాన కార్యదర్శి జీవిత మాట్లాడుతూ దోషుల్ని చంపితే
ఇలాంటి ఘటనలు పునరావృతం కావన్నారు. వయసు తారతమ్యాలు కూడా చూడకుండా ఇలాంటి దురాగతాలకు పాల్పడటం చూస్తుంటే మనం ఎటుపోతున్నామో అర్థంకావడం లేదన్నారు.
మాజీ ఎంపీ మురళీమోహన్ మాట్లాడుతూ ‘ఇలాంటి నికృష్టులకు కఠిన దండన కావలసిందే. అలా ఉంటేనే భయం అనేది
కలుగుతుంది. పిల్లల పెంపకంలోనూ మార్చురావాలి. చూడకూడని దృశ్యాలను పిల్లలు చూసేరోజులు వచ్చాయి. ఇది మారాలి.
ఇలాంటి దోషులకు ఉరే సరైనది. ఫాస్ట్ ట్రాక్ తీర్పులు కావాలి’ అన్నారు.
‘మా’ ఉపాధ్యక్షడు రాజశేఖర్ మాట్లాడుతూ
‘దుబాయ్ లో ఆడవాళ్ల వైఫు చూడాలంటే భయం. అక్కడ కఠిన దండనలు ఉంటాయి కాబట్టే అలాంటి వాతావరణం ఉంది.
మగపిల్లలకు పాఠశాలల్లో సైకాలజీ క్లాసులు పెట్టి మార్పు వచ్చేలా చేస్తే మంచిది’ అన్నారు. తమ్మారెడ్డి భరద్వాజ
మాట్లాడుతూ దోషులను రాత్రికి రాత్రి చంపేస్తే తాను చాలా సంతోషిస్తానన్నారు. అన్నీ నిర్దారణ అయినపుడు ఇంకా ఇన్వెస్టిగేషన్
పేరుతో కాలయాపన ఎందుకు చేస్తున్నారో అర్థంకావడం లేదన్నారు. మాజీ మంత్రి బాబూమోహన్ మాట్లాడుతూ ఈ ఘటనలో
ప్రభుత్వం నిద్రపోతున్నట్లు వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. దోషుల్ని వారి తల్లదండ్రులే చంపమంటుంటే ప్రభుత్వానికి జాలి
ఎందుకో అర్థంకావడం లేదన్నారు. ‘కనీసం భరోసా కోసమైనా సీఎం మాట్లాడి ఉంటే బాగుండేదని, ప్రభుత్వం ఉలకడంలేదు
పలకడంలేదు. తలుపులు వేసుకుని పడుకోవడానికా ప్రభుత్వాలు?’ అన్ని ప్రశ్నించారు.దోషుల గుండెల్లో దడపుట్టేలా
ప్రభుత్వం చేయాలన్నారు. ‘మా’ మాజీ అధ్యక్షడు శివాజీ రాజా మాట్లాడుతూ ‘ప్రతి పోలీసుస్టేషన్ లోనూ సజ్జనార్ లాంటి
అధికారి ఉండాలన్నారు. ఫిలింనగర్ లో రోడ్ల మీదే తాగుతున్నా అడిగేనాధుడు లేడన్నారు. 120 కోట్లమంది జనాభా ఉన్న
మన దేశంలో కోటి మంది వెధవలు చనిపోయినా నష్టం లేదన్నారు. నిర్మాతల మండి అధ్యక్షుడు సి. కళ్యాణ్ మాట్లాడుతూ
దోషి అనేవాడు శాశ్వతంగా ఈ లోకంటో ఉండకూడదన్నారు. సెలఫోన్ లు వచ్చాక ఇలాంటి విచ్చలవిడితనం
పెరిగిపోయిందన్నారు. సినిమా ప్రారంభంలో సిగరెట్ట హెచ్చరిక బదులు ‘ప్రతి స్ర్తీ మన తల్లి, మన చెల్లి, మన అక్క అని
భావించాలి’ అనే సందేశం ఉంటే బాగుంటుందని, దీన్ని తన సినిమా నుంచే ప్రారంభిస్తానన్నారు. దోషుల్ని బయట వదిలేస్తే
జనమే తీర్పు చెబుతారన్నారు. దర్శకుడు ఎన్. శంకర్ మాట్లాడుతూ ఇది నిర్బయతో ప్రారంభం కాదు దిశతో ముగింపు కాదని,
దీనికి శాశ్వత పరిష్కారం కావాలని అన్నారు. వయసు బలహీనతల్ని రెచ్చగొట్టేలా సోషల్ మీడియా ఒక జనరేషన్ మెదళ్ల మీద
తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు. మనకిప్పుడు పెద్దబాలశిక్ష లేదు పెద్దల మాట వినే పరిస్థితి లేదన్నారు. సోషల్ మీడియా
దిశను మార్చాల్సిన అవసరం ఉందన్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ఇలాంటి సంఘటనలు మళ్లీ
మళ్లీ జరగకుండా చట్టంలో మార్పులు తేవాలన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో హేమ, జయలక్ష్మి, త్రిపురనేని చిట్టి, బెనర్జీ,
సురేష్ కొండేటి, తనీష్ , ఏడిద శ్రీరామ్ , సమీర్ , ఉత్తేజ్, రవిప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

Please follow and like us:
0

You may also like...

Leave a Reply

Your email address will not be published.

Enjoy this blog? Please spread the word :)